This war is for the redistribution of markets.

 ఈ యుద్ధం మార్కెట్ల పునర్విభజన కోసమే

తారీఖులు, దస్తావేజులు చరిత్ర కాదని శ్రీశ్రీ అన్నట్లే, ఏ యుద్ధం ఏ వైపు నుండి ప్రారంభమైనదో, ఏ దేశం మీద ఏ దేశం తొలి దాడి చేసిందో వంటి వివరాల్ని బట్టి యుద్ధ లక్ష్యాలని నిర్ధారణ చేయలేమని లెనిన్ అంటాడు. 

 ఉక్రెయిన్ కి నాటోలో సభ్యత్వం, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, రష్యాకి ఉక్రెయిన్ తరలించిన డ్రోన్స్ తో భారీ దాడి, ప్రతీకారంగా అణుదాడికి వెనకాడననే రష్యా హెచ్చరిక.... 

  ఇజ్రాయల్ పై హమాస్ దాడి, గాజాపై ఇజ్రాయల్ యుద్ధం, ఎట్టకేలకు రాజీ ఒప్పందం, తిరిగి దానిని ఉల్లoఘించడం.... 

 సెటిలర్ స్టేట్ గా పుట్టి, మధ్యప్రాచ్య ఉగ్రవాద రాజ్యంగా ఇజ్రాయల్ మారిందనే ఆరోపణలు,  తనకు వ్యతిరేకంగా కవ్వింపు చర్యల పట్ల ప్రతీకారంగా ఇరాన్ పై తాను దాడికి దిగినట్లు ఇజ్రాయల్ ప్రకటన,  ఇజ్రాయల్ పై ప్రతీకార దాడికి దిగిన ఇరాన్...

 ఈ అన్నింటిని కేవలం  యుద్ధ నియమాల్ని బట్టి విశ్లేషిస్తే యుద్ధ లక్ష్యాలు అర్ధం కావు. సారాజీవో లో సెర్బీయన్ విద్యార్థి పేల్చిన తూటా మొదటి ప్రపంచ యుద్ధానికీ, పోలండ్ సరిహద్దు ఘర్షణ రెండవ ప్రపంచ యుద్దానికీ కారణమనే కట్టుకధలు యుద్ధవేళల్లో ప్రాచుర్యం పొందడం సహజం. వాటిని బట్టి యుద్ధ గమనాల్ని గానీ, వాటి గమ్యాలను గానీ నిర్ధారణ చేయలేము. 

 అడవి లేకుండా చెట్లు వుంటాయి. కానీ చెట్లు లేకుండా అడవి ఉండదు. విడిగా చెట్లను విశ్లేషణ చేస్తే అడవిని విశ్లేషణ చేసినట్లు కాదు. అడవి విశ్లేషణలో చెట్లు కూడా భాగమౌతాయి. 

 తెరపై మీడియా ద్వారా ప్రాచుర్యం పొందే వార్తల్ని బట్టి ఈ యుద్దాలకు దారి తీసిన మూల కారణాల్ని నిర్ధారణ చేయలేము. ఆ మూల కారణాల్ని అర్ధం చేసుకున్న తర్వాత ఈ తెరపై ప్రాచుర్యం పొందే కట్టుకధల గుట్టును అర్ధం చేసుకోగలం. 

 తాను గెలిస్తే ఉక్రెయిన్, పాలస్తీనా యుద్దాలను విరమింపజేస్తాననీ,  యుద్ధ రహిత ప్రపంచ సాధనే తన లక్ష్యమనీ ఎన్నికల ముందు ట్రంప్ ఇచ్చిన హామీ తెల్సిందే.

 రక్తపాత యుద్దాలను విరమింపజేసి రక్తరహిత వాణిజ్య యుద్దాల వైపు తెర లేపే ట్రంప్ వ్యూహం  గురి తప్పుతోంది. ఆ రక్త రహిత వాణిజ్య యుద్ధం రక్తపాత యుద్దానికి దారి తీయడానికి సమయం పడుతుందనే అంచనా సైతం నిజం కాదని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. 

 అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి నాలుగు నెలలు నిండింది. యుద్ద పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతోంది. విరమింపజేస్తానని హామీ ఇచ్చిన రెండు యుద్దాలు ఆగలేదు. అవి నాలుగు యుద్దాలుగా మారాయి. 

 ఉక్రెయిన్ వర్సెస్ రష్యా; పాలస్తీనా వర్సెస్ ఇజ్రేలీ కొనసాగుతూ ఉండగానే, పాక్ వర్సెస్ భారత్, ఇరాన్ వర్సెస్ ఇజ్రేలీ  యుద్దాలకు కొత్తగా తెరలేచాయి. 

 ఈ యుద్దాలకు కారణం యుద్ధ నిమగ్న దేశాల  పాలకుల మధ్య వ్యక్తిగత ఆధిపత్యం కాదు. ఆయా సర్కార్ల మధ్య ఆధిపత్య రాజనీతి కాదు. ఇది మార్కెట్ల పునర్విభజన కోసమే. సామ్రాజ్యవాద రాజ్యాల పోటీయే వీటికి మూలకారణం.

  నేటి అంతర్జాతీయ పరిస్థితి మార్కెట్ల పునర్విభజనకు పరిపక్వం అవుతోంది. ఇది REDIVISION OF MARKETS కి సీజన్! ఈ దృష్టితో తాజా యుద్దాల విశ్లేషణ చేయాలి.

 109 ఏండ్ల క్రితం లెనిన్  'పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశే సామ్రాజ్యవాదం' రచన చేశాడు. తాజా యుద్దాల మూల కారణాలను అర్ధం చేసుకోవడానికి ఆ గ్రంధం బాగా ఉపకరిస్తుంది. 

  USSR పతన వేళలో మార్కెట్ల పునర్విభజన సామ్రాజ్యవాదుల ఎదుట ఎజెండాగా ముందుకు వచ్చింది. నేటి  ప్రపంచ పరిస్థితి అందుకు మళ్ళీ పరిపక్వం చెందుతోంది. 

 మార్కెట్ల పునర్విభజన కోసం సామ్రాజ్యవాద రాజ్యాల మధ్య పోటీ ఫలితంగా తలెత్తుతోన్న యుద్దాలుగా వీటిని విశ్లేషణ చేయాల్సి వుంది. అంతే తప్ప సెర్బీయన్ విద్యార్థి, పోలండ్ దేశ సరిహద్దు ఘర్షణ వంటి కట్టుకధల ఆధారంగా విశ్లేషణ చేయరాదు. మార్కెట్ల పునర్విభజన దృష్టితో తాజా యుద్దాల వెనక దాగిన కారణాల గూర్చి విశ్లేషణ చేద్దాం. 

  USSR పతన వేళలో మార్కెట్ల పునర్విభజన కోసం అమెరికా చేసిన యుద్ధాలు అమెరికాకు ఒక శాపంగా మారాయి. ఇరాక్, ఆప్గన్ సాయుధ జాతీయ విమోచనా యుద్దాలు అమెరికాను యుద్ధ ఊబిలోకి దింపి ఊపిరాడకుండా చేసింది.  యుద్ద ఊబిలో అమెరికా మునిగిన సమయంలో అమెరికాకి చెందిన పాత మార్కెట్లు చాలా వరకు చైనా, రష్యా (ముఖ్యంగా చైనా) ల చేజిక్కాయి. ఆ చేజారిన మార్కెట్లు ఆసియా, ఆఫ్రికా వరకే పరిమితం కాదు. 1820 దశకంలో మన్రో అమెరికా పెరటి దొడ్డిగా మార్చిన లాటిన్ అమెరికా వరకూ  విస్తరించడం గమనార్హం! 

 USSR పతనం తర్వాత చేజిక్కిన కొత్త మార్కెట్లు తన సైనికుల రక్తధారల మధ్య కాపాడుకోవడమే అమెరికాకి కష్టమైనది. పైగా పాత మార్కెట్లు  కొత్తగా చేజారాయి. అవి  లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా మార్కెట్లు సైతం చేజారిపోయాయి. అంటే కొండ నాలికకి మందు వేస్తే అసలు నాలుక ఊడినట్లు మారింది. ఈ కారణంగా అమెరికా వాణిజ్య లోటు, రక్షణ వ్యయం, జీవన వ్యయం,  అప్పు వంటివి పెరిగాయి. అమెరికా 36 ట్రిలియన్ డాలర్ల అతి పెద్ద రుణగ్రస్త దేశంగా దిగజారింది. అది మరోసారి గొప్ప దేశంగా మారాలనే పేరిట 'మాగా' నినాదం ట్రంప్ ఇవ్వడం తెల్సిందే. మరోసారి అనడమంటే ఇప్పుడు అమెరికా దిగజారిందని ట్రంప్ అంగీకరించడమే. ఈ నేపథ్యం నుండి తాజా యుద్దాలను విశ్లేషణ చేయాల్సి వుంది. 

 ప్రపంచంలో అతిపెద్ద చమురు నిల్వల దేశాల్లో ఇరాన్ ఒకటి! అది నేడు చైనాకు పెద్ద చమురు ఎగుమతి దేశం. రష్యాకి వ్యూహత్మక మిత్రదేశం. ఒకవైపు ఉక్రెయిన్ ని నియంత్రణ చేసి రష్యాకి అనుకూల రాజీ చేస్తాననే ట్రంప్, మరోచోట రష్యా మిత్ర దేశం ఇరాన్ పై ఇజ్రాయెల్ తో యుద్ధం చేయిస్తోంది. భోగోళిక రాజకీయ క్రీడలో ఇలా పొందికలు మారడం సహజమే. 

 ఇది మూడవ ప్రపంచ యుద్ధం కాదు. దానికి ముందస్తు దశగా కూడా ఇప్పుడే చెప్పలేము. కానీ ప్రాంతీయ స్వభావం గల యుద్ధం మాత్రం కాదు. ప్రపంచ సామ్రాజ్యవాద రాజ్యాలతో ప్రత్యక్ష లేదా పరోక్ష  సంబంధం గల యుద్దాలుగా క్రమంగా మారుతున్నాయి. ఈ కొత్త పరిస్థితిని చూడాలి. ఇరాన్ పై ఇజ్రాయల్ తాజా దాడి భౌగోళిక స్వభావాన్ని క్రమంగా సంతరించుకునే అవకాశం వుంది. ఈ యుద్దాల పట్ల భారత్ వైఖరి భారతదేశ ఆర్ధిక, రాజకీయ వ్యవస్థను అమెరికాపై మరింతగా ఆధారపడే పరిస్థితికి దారి తీస్తుంది. యుద్ధం మన దేశప్రజల జీవన స్థితిని మరింత దుర్భరంగా దిగజార్చే అవకాశం వుంది. ఈ మార్కెట్ల పనిర్విభజన కోసం యుద్దాలకు వ్యతిరేకంగా గొంతెత్తి ఖండిద్దాం.

 ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

16-6-2025

Comments

Popular posts from this blog

Deep state in the United States

The CAA will be implemented before the elections.

Who supported Trump