China warning to its enemies.
మాతో పెట్టుకుంటే మటాషే : జిన్‌పింగ్ హెచ్చరిక
Jul 1 2021
బీజింగ్ : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆ దేశ శత్రువులను గట్టిగా హెచ్చరించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) వందేళ్ళ సంబరాల్లో ఆయన చాలా దూకుడుగా మాట్లాడారు. శత్రువులు చైనాకు హాని కలిగించేందుకు, పలుకుబడిని చూపించడానికి ప్రయత్నిస్తే, మహా ఉక్కు గోడకు ఢీకొన్నట్లేనని తెలిపారు. చైనా, తైవాన్ పునరేకీకరణకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. హాంగ్ కాంగ్ పరిస్థితులను ప్రస్తావిస్తూ, చైనా భద్రత, సార్వభౌమాధికారాలను కాపాడుతూ, హాంగ్ కాంగ్‌లో సాంఘిక సుస్థిరతను సాధిస్తామన్నారు.
‘‘చైనీయులమైన మేము న్యాయాన్ని సమర్థించే ప్రజలం. బలంతో చేసే బెదిరింపులకు లొంగబోం. ఓ దేశంగా మేం గట్టి ఆత్మవిశ్వాసంతో సగర్వంగా నిలుస్తాం. ఏ ఇతర దేశ ప్రజలకు మేము హాని చేయలేదు, వారిని అణచివేయలేదు, వారిపై ఆధిపత్యం చలాయించలేదు. మేం ఎన్నటికీ అలా చేయబోం. అదే సమయంలో మమ్మల్ని అణగదొక్కడానికి, మాకు హాని చేయడానికి లేదా మాపై ఆధిపత్యం చలాయించడానికి ఏ విదేశీ శక్తికీ అవకాశం ఇవ్వబోం. ఎవరైనా అలా చేయడానికి ప్రయత్నిస్తే, 140 కోట్ల మందికిపైగా ఉన్న చైనీయులతో నిర్మితమైన మహా ఉక్కు గోడను తమంతట తాము ఢీకొన్నట్లే’’ అని జీ జిన్‌పింగ్ అన్నారు.
మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతుడైన నేతగా జీ జిన్‌పింగ్‌ను పరిగణిస్తున్నారు. జీ జిన్‌పింగ్ చైనా కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఆయన సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతి కూడా.
జింజియాంగ్, హాంగ్ కాంగ్, టిబెట్‌లలో మానవ హక్కుల ఉల్లంఘనకు చైనా పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి మూలాలను ఉద్దేశపూర్వకంగానే చైనా దాచిపెడుతోందని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. ఇటువంటి సమయంలో స్వదేశంలో కోవిడ్-19ను నియంత్రించడంలో చైనా విజయవంతమైంది. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో దూకుడుగా వ్యవహరించడానికి చైనాకు అవకాశం ఇస్తున్నాయి.
తియానన్మెన్ స్క్వేర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 71 సైనిక విమానాలు విన్యాసాలు నిర్వహించాయి. దాదాపు 70 వేల మంది హాజరయ్యారని చైనా మీడియా తెలిపింది. జీ జిన్‌పింగ్ మాట్లాడేటపుడు ఓ పద్ధతి ప్రకారం చప్పట్లు కొడుతూ కొందరు ప్రోత్సహించడం గమనార్హం. సీపీసీ వందేళ్ళ సంబరాలను గుర్తు చేస్తూ ‘‘100’’ ఆకారంలో హెలికాప్టర్లు ఎగిరాయి.
Comments
Post a Comment