నలుపు, తెలుపు చేతులు కలిపి..వర్ణవివక్ష వ్యతిరేక ఆందోళన
నలుపు, తెలుపు చేతులు కలిపి..
వర్ణవివక్ష వ్యతిరేక ఆందోళనల్లో శ్వేత జాతీయులు
ఫ్లాయిడ్ హత్యపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు
అమెరికాలో 2013లో జరిగిన ఘటన ఇది. 17 ఏళ్ల నల్ల జాతీయుడైన ట్రెవోన్ మార్టిన్‌ను కాల్చి చంపిన కేసులో జిమ్మర్‌సన్ అనే శ్వేత జాతీయుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిందే ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ సంస్థ. ఈ సంస్థ కార్యవర్గం, సభ్యుల్లో నల్ల జాతీయులే కాకుండా శ్వేత జాతీయులు కూడా ఉన్నారు. అలిసియా గార్జా అనే కార్యకర్త అప్పట్లో ‘బ్లాక్ పీపుల్. ఐ లవ్ యు. ఐ లవ్ అజ్. అవర్ లైవ్స్ మేటర్’ అంటూ నినాదం చేసింది. ఆ నినాదమే ఈ ఉద్యమ సంస్థ ఏర్పాటుకు దారితీసింది.
ఇప్పుడు కూడా అమెరికాలో అదే పరిస్థితి! ఆఫ్రికన్- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై అమెరికా రగిలిపోతోంది. దేశంలోని 140 నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ‘మాకు ఊపిరి ఆడటం లేదు’.. అంటూ ఫ్లాయిడ్ చివరి మాటలే ఆ దేశ ప్రజల నినాదంగా మారాయి. ఇప్పుడు కూడా నల్ల జాతీయులకు శ్వేత జాతీయులు మద్దతు తెలుపుతున్నారు. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్, సిరియా, బ్రెజిల్, మెక్సికో, ఐర్లాండ్, న్యూజిలాండ్, కెనడా, పోలాండ్, ఆస్ర్టేలియా వంటి శ్వేత జాతీయులు అధికంగా నివసించే దేశాల్లోనూ నిరసనకారులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శ్వేతజాతీయులు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. బ్రిటన్‌లో కరోనా లాక్‌డౌన్ నిబంధనలను సైతం ఉల్లంఘించి వందలాది మంది అమెరికా రాయబార కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు చేశారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో మాస్క్‌లు ధరించి మరీ వందలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు.
‘మేమంతా జార్జి ఫ్లాయిడ్స్‌మే... జాత్యహంకారం మాకు ఊపిరి ఆడనివ్వడం లేదు’ అంటూ ఫ్రాన్స్ రాజధాని పారి స్‌లో మాస్క్‌లు ధరించి, మోకాళ్లపై నిలబడి వందలాది మంది నినాదాలు చేశారు. ‘న్యాయం లేనిదే శాంతి లేదు’ అంటూ డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో నిరసనలు మిన్నంటాయి. బ్రెజిల్‌లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. ‘ఇక్కడా అక్కడా అని లేదు.. ప్రపంచమంతటినీ జాత్యహంకారం చంపుతోంది’ అంటూ మెక్సికో నగరంలో నిరసనకారులు నినదించారు. ‘జాత్యహంకారం ప్రపంచానికే సవాల్ విసురుతోంది. దాని అంతాన్ని మేము కోరుకుంటున్నాం’ అంటూ ఐర్లాండ్‌లోని డబ్లిన్ నగర వీధుల్లో నిరసనకారులు నినాదాలు చేశారు. న్యూజిలాండ్‌లో వేలాది మంది ప్రదర్శనల్లో పాల్గొన్నారు. కెనడా, పోలాండ్, ఆస్ర్టేలియాల్లో జరిగిన ర్యాలీల్లో వందలాది మంది పాల్గొన్నారు. ఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నవారిలో అధిక సంఖ్యాకులు శ్వేతజాతీయులే. అమెరికాలో జరుగుతున్న ఆందోళనలపై పదవీ విరమణ తర్వాత రాజకీయాలపై పెద్దగా స్పందించని మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ క్రికెటర్ క్రిస్‌గేల్, స్విట్జర్లాండ్, సెర్బియా, స్పెయిన్ దేశాలకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారులు రోజర్ ఫెదరర్, జకోవిచ్, రఫెల్ నడల్ తదితరులు జాత్యంహకారానికి వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.
అమెరికాలో ఆగని నిరసనలు
కాలిఫోర్నియా మేయర్ రాజీనామా
అమెరికాలో నల్లజాతీయుల నిరసనలు కొనసాగుతున్నాయి. వాషింగ్టన్, న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజెలిస్ సహా.. అనేక నగరాల్లో వేల మంది రహదారులను దిగ్బంధించారు. కొన్ని ప్రాంతాల్లో లూటీలు, ఆస్తుల విధ్వంసం కొనసాగాయి. ఆందోళనల నడుమ మేయిన్ రాష్ట్రంలోని కరోనా నివారణ మందులు తయారు చేసే ఓ కంపెనీని ట్రంప్ సందర్శించనున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ జెనెత్ మీల్స్ ఇటీవల ట్రంప్‌కు కొన్ని సూచనలు చేశారు. ‘‘మీరు వాక్చాతుర్యాన్ని పక్కన పెట్టండి. విభేదాలను సృష్టించే వ్యాఖ్యలు చేయవద్దు’’ అన్నారు. ట్విటర్ మరోమారు ట్రంప్‌కు షాకిచ్చింది. ఫ్లాయిడ్ మరణాన్ని ఖండిస్తూ ట్వీట్ చేసిన ఓ వీడియోను తొలగించింది. దక్షిణ కాలిఫోర్నియాలోని టమాక్యోలా నగర మేయర్ జేమ్స్ స్టెవార్ట్ వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు రాగా తన పదవికి రాజీనామా చేశారు.
Comments
Post a Comment